“అందాల ప్రదర్శనలతో కనకవర్షం “, “సెక్స్ బాంబు”, “హాట్ హాట్ దృశ్యాలు” ఇలాంటి మాటలు చవకబారు సెక్స్ పుస్తకాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు టి.వి 9, టి.వి. 5 ల లో ఇలాంటి పదాలు కోకొల్లలు. ఇలాంటివి పైపెచ్చు మహిళా ఏంకర్లు, న్యూస్ రీడర్ల నోటితో చెప్పిస్తున్నారు. చిన్నారులు, యువతలతో కూడిన కుటుంబాలు చూసే కార్యక్రమాల్లో ఇలాగేనా పేట్రేగి మాట్లాడటం?.
12-11-2007 రాత్రి టి.వి.9 లో బద్రి ప్రెజెంటర్ గా గుంటూరు యన్.టి.ఆర్ మానస సరోవరం పార్కులో ప్రేమికుల ప్రవర్తనపై కార్యక్రమం ప్రసారం అయ్యింది. అక్కడి పార్కులో జంటల కౌగలింతలు, పెదవులు కలుపుతూ ముద్దులూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి , గ్రాఫిక్స్ జత పరిచి 8 సార్లు అవే దృశ్యాలని పదే పదే ప్రదర్శించారు.
పైపెచ్చు కార్యక్రమం లో ఇలాంటి కార్యకలపాలని చూడటాన్ని “వాయెరిజం ” అనే ఒక మనోవైకల్యంగా పేర్కొన్నారు. మరి ఇలాంటి దృశ్యాలని కనీసం మసక పర్చడం లాంటివైనా చేయకుండా అదే పనిగా పదే పదే చూపించే టి.వి.9 ధోరణి ని యేమనాలి?
12-11-2007 రాత్రి “మూవీస్ & మస్తీ ” కార్యక్రమం పేరిట టి.వి.5 లో మితిమీరిన శృంగార దృశ్యాలు కలిగిన ఆంగ్ల చిత్రం క్లిప్పింగులని చూపించడమే కాక “రేపు మళ్ళి ఇంకా హాట్ కబుర్లతో ఇక్కడే కలుద్దాం” అని మహిళా యాంకర్తో చెప్పించడం ….
టి.వి.9 ట్యాగు లైను “మరింత మెరుగైన సమాజం కోసం”
- అలాంటి శృంగార దృశ్యాలని తెలివిగా వాడుకునే చవకబారు ఎత్తుగడలతో వ్యూయర్షిప్ పెంచుకునే ప్రయత్నాల వల్ల “మెరుగైన సమాజం” వస్తుందా?.
టి.వి. 5 వాళ్ళు అంటూ ఉంటారు “ఆల్వేస్ ఎహెడ్” అని
- అందరికన్నా ముందుండాలంటే ఇంతకన్నా మార్గాలు కనిపించడంలేదా మీకు?
ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే . వ్యాపారం కోసం మరీ ఇంత నీతి బాహ్యంగా వ్యవహరిస్తూ పైపెచ్చు సమాజానికి రక్షగా నిలుస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్న టి.వి చానళ్ళ ఆగడాలకి అడ్డుకట్ట వెయ్యకపోతే సమాజం నాశనం అవ్వడానికి ఎంతో కాలం పట్టదు.