ప్రేమ, స్నేహం అడుక్కునేవి కావు. డిమాండ్ చేసేవి అంతకన్నా కావు. ప్రేమిస్తే ఎదుటివాళ్ళకి ఏదో రోజు, ఎదోలాగ తెలియక మానదు. మరీ మనసులో దాచుకునే మూగ ప్రేమ అయితే తప్ప.
తిరిగి ఆశించేది ప్రేమ ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. అదేం అప్పు కాదు. ఇస్తే తిరిగివ్వాలనడానికి.
వ్యామోహమే ప్రేమ అనేది సినిమా సిద్దాంతం కానీ వాస్తవం కాదు..
ప్రేమ(?) లో ఒక సిరీస్ ఆఫ్ ఏక్టివిటీస్ నిర్ధారించే సినిమాలు, సీరియళ్ళు… వాటిని అనుకరించే ప్రయత్నంలో పాట్లు, ఫీట్లూ ……
ప్రేమ తప్పు కాదు. కానీ, నానా వికారాలూ ప్రేమే అని డిసైడ్ చేసేస్కుని మిగతా వారిని ఇబ్బంది పెట్టడమే తప్పు.
మనం ప్రేమించేవారి సుఖ సంతోషాలు కోరుకోవడం తో బాటు వారికి అవి అందేలా ప్రయత్నం చేయడంలో ప్రేమ ఉంటుంది.
ప్రేమ అత్యంత సున్నితమైనదే కాక శక్తివంతమైన ప్రభావపూరితం కూడా. నిజమైన ప్రేమ అద్భుతాల్ని చేయిస్తుంది. అణువణువునా పరమాణు శక్తిని నింపుతుంది. దానికి ఇచ్చే శక్తి ఉంటుంది కానీ కోరుకునే తాపత్రయం ఉండదు.
అలాంటి ప్రేమ ఉదయించినప్పుడు మనకన్నా అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. అది తెలుగు తెర సినిమా ప్రేమల కన్నా లక్ష రెట్లు గొప్పదని నిశ్చయంగా చెప్పచ్చు.
ప్రేమ కలిగినప్పుడు నిరభ్యంతరంగా ప్రేమించండి. చెప్పాలనుకుంటే చెప్పండి. కానీ ఒక్కటే… తిరిగి ఆశించద్దు. అవతలి వాళ్ళూ మనల్ని ప్రేమిస్తే బానే ఉంటుంది కానీ ప్రేమించి తీరాలన్న రూలు లేదు. ఎదుటి వారు తిరస్కరించినా ఆ నిర్ణయాన్ని ప్రేమించడంలోనే అసలైన ప్రేమ నిండి ఉంటుంది.